కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికను జూన్ 23న నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సీడబ్ల్యూసీ ప్రకటన కొద్ది సేపటికే మళ్లీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఎన్నిక వాయిదా వేయాలని మెజార్టీ నాయకులు కోరడంతోనే అధ్యక్ష ఎన్నిక వాయిదా పడినట్లు సమాచారం. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిచిన సంగతి తెలిసిందే.
కాగా, 2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అయితే, తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీలోని కొంతమంది నేతలు పట్టుబడుతున్నారు. అధ్యక్ష ఎన్నిక వాయిదా పడడం ఇది మూడోసారి కావడం గమనర్హం.