రివ్యూ:ఈడు గోల్డ్ ఎహే

325
- Advertisement -

మర్యాదరామన్నతో కెరీర్‌లో పెద్ద హిట్ అందుకున్న సునీల్.. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. విజయాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ.. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన జక్కన్న మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ అది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆశలన్నీ ‘ఈడు గోల్డ్ ఎహే’పైనే పెట్టుకున్నారు. ట్రైలర్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈడు గోల్డ్ ఎహే ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

eedugoldpromisnews

కథ :
చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో అనాథగా మారుతాడు బంగర్రాజు(సునీల్). ఎవరూ లేకపోవడంతో తనకు నచ్చిన పనల్లా చేసుకుంటూ పోతాడు. అయితే బంగర్రాజు ఎక్కడ పనికి కుదిరినా ఆ యజమానికి తిప్పలు తప్పవు. దీంతో ఎవరు కూడా బంగార్రాజుకి పని ఇవ్వరు. అలాంటి బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజు వెంటపడుతుంటారు. అయితే సునీల్ వర్మలా ఉండే బంగార్రాజు వెంటపడుతుంటారు. ఓ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన బలం ట్విస్ట్‌లు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి. హీరో సునీల్ ఎప్పట్లానే తన కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ అందాలతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, పృథ్వీ, నరేష్ తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రతికూలాంశం.. స్క్రీన్‌ప్లే లేకపోవడమే. సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా బోర్ కొట్టినట్లే అనిపించింది. ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకోవడాన్ని కూడా మైనస్‌గానే చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ట్విస్టులతో సాగిపోయో కథలో పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని కామెడీ ట్రాక్స్ కావాలని ఇరికించినట్లు అనిపించింది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు వీరూ పోట్ల ఒక కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను తయారు చేసుకున్నా.. అందుకు తగ్గట్టు స్క్రీన్‌ప్లే పకడ్బందీగా లేదు. కొన్నిచోట్ల వీరూ పోట్ల మార్క్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది. సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు.

తీర్పు :
‘ఈడు గోల్డ్ ఎహే’.. చెప్పుకోవడానికి మంచి కథ ఉండి, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా. పైన చెప్పిన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి ఏమీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. టైమ్‌పాస్ చేసేలా ఉంది.

విడుదల తేదీ:07/10/2016
రేటింగ్:3/5
నటీనటులు:సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్..
సంగీతం : సాగర్ మహతి
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
దర్శకత్వం : వీరూ పోట్ల

- Advertisement -