ఝార్ఖండ్‌లో అక్రమ బొగ్గు తవ్వకాలు దానికి సంబంధించి వెలుగుచూసిన భారీ మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన చర్యలు చేపట్టింది. బొగ్గు గనుల హబ్‌గా పేరొందిన ధన్‌బాద్ జిల్లాలోని దాదాపు 25 ప్రదేశాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమ వ్యాపారాలు, నల్లధనం మళ్లింపుతో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు, కీలకమైన ఆస్తుల పత్రాలు, డిజిటల్ ఆధారాలు మరియు వివిధ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా అక్రమ మార్గాల ద్వారా సమకూర్చుకున్న సుమారు రూ. 600 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులను ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నిధులతో ముడిపడి ఉన్న పలు ఖాతాలు, ఆస్తులు మరియు మదుపులను అధికారులు తక్షణమే ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది.
అక్రమ ధనార్జన నిరోధక చట్టం (PMLA) కింద ఈ కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. అక్రమ బొగ్గు తవ్వకాలు, రవాణా ద్వారా వచ్చిన నిధులు ఎక్కడెక్కడికి మళ్లాయి, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని ఛేదించడమే లక్ష్యంగా ఈడీ పనిచేస్తోంది.
Also Read:శర్వా..’భోగి’ అప్‌డేట్
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సోదాలు, దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అధికారుల విచారణ పూర్తికావాల్సి ఉంది.

