పంజాబ్ సీఎంకు సుప్రీం నోటీసులు

0
- Advertisement -

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2020లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన సందర్భంగా నమోదైన కేసును కొట్టివేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చండీగఢ్ పరిపాలన విభాగం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు పంపింది.

2020లో చండీగఢ్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆ నిరసన సమయంలో అక్రమంగా గుమికూడడం,రాళ్లు రువ్వడం మరియు అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో భగవంత్ మాన్ మరియు ఇతర ఆప్ నేతలపై చండీగఢ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చండీగఢ్ పరిపాలన యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు సదరు కేసుతో సంబంధం ఉన్న ఇతర ఆప్ నాయకులకు నోటీసులు జారీ చేస్తూ వారి నుంచి సమాధానం కోరింది.

Also Read:శర్వా..’భోగి’ అప్‌డేట్

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పు చట్టబద్ధంగా సరైనదేనా కాదా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ పిటిషన్‌పై ఆప్ నేతల స్పందన అందిన తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ కొనసాగించనుంది.

- Advertisement -