50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్‌కు న్యాయశాఖ లేఖ రాసింది. రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ నియమం ప్రకారమే ఇవాళ సీజేఐ యూయూ లలిత్.. తదుపరి సీజే పేరును ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందే ఇవాళ సిఫారసు లేఖను ఆయన అందజేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి. ఆయన పేరును తదుపరి సీజేఐగా ప్రతిపాదిస్తూ రాసిన లేఖను జస్టిస్ లలిత్ కేంద్రానికి పంపారు. ఒక వేళ జస్టిస్ లలిత్ చేసిన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే, అప్పుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నవంబర్ 10, 2024లో ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.