నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం, వర్షాలు లేకపోవడంతో తీరప్రాంత రాష్ట్రమైన గోవాలో తాగునీటి నిల్వలు అడుగంటుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఒక నెలకు సరిపడా తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందని గోవా ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో వివిధ జలాశయాల్లో నీటిమట్టాలు ఘోరంగా పడిపోయాయని ఆ రాష్ట్ర మంత్రి సుభాష్ ఫాల్ దేశాయ్ తెలిపారు.
అయితే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక నెలకు సరిపడేంత నీరు అందుబాటులో ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈలోగా ఉన్న నీరు పూర్తిగా అయిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కఠినమైన మార్గదర్శకాలను జారీ చేయనుందని ఆయన వెల్లడించారు.
పరిశ్రమలతో సహా పలు రంగాల నుండి రాష్ట్రంలో నీటి సరఫరా పరిస్థితిపై తనకు ఫోన్‌లు వస్తున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డ్యామ్‌లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల వివరాలను అంచనా వేయడానికి జలవనరుల శాఖ మంత్రి సుభాష్ శిరోద్కర్ తో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఫాల్ దేశాయ్ తెలిపారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచామని, ఎక్కడా కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నీటి కొరత లేదు కానీ భవిష్యత్తులో రాదని చెప్పలేం అని హెచ్చరించారు. సలావ్లిమ్ డ్యామ్ మొత్తం దక్షిణ గోవా, కుషావతి జిల్లా మరియు ఉత్తర గోవాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ డ్యామ్ ప్రస్తుతం 27 శాతం నీటితో మాత్రమే ఉంది. దీని నుండి రోజుకు 280 మిలియన్ లీటర్ల (MLD) నీటిని తీసుకునే సామర్థ్యం ఉంది.
అంజునెమ్ డ్యామ్ ఉత్తర గోవాలోని సత్తారి తాలూకాలో, గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు నీటి నిల్వలు ఘోరంగా 9.9 శాతానికి పడిపోయాయి. దీని సామర్థ్యం 50 MLD. మ్హైసల్ డ్యామ్ ఉత్తర గోవాలోని ఫోండా సమీపంలో ఉన్న శిరోడాలోని ఈ డ్యామ్ నీటిమట్టం ప్రస్తుతం 19 శాతం వద్ద ఉంది. దీని డ్రాయింగ్ సామర్థ్యం 10 నుండి 14 MLD.
Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్
చపోలి మరియు అమ్తానే డ్యామ్‌లు….కానకోన తాలూకాలో ఉన్న చపోలి డ్యామ్, అలాగే ఉత్తర గోవాలోని బార్డెజ్ తాలూకాకు నీరందించే అమ్తానే జలాశయాలలో ప్రస్తుతం “మంచి” నీటి నిల్వలు ఉన్నాయని, అక్కడ నీటి కొరత ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం.. వచ్చే వారాంతం నాటికి గోవా రాష్ట్రంలో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

