పేపర్ లీక్‌పై ప్రధానికి బహిరంగ లేఖ

1
- Advertisement -

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. గత ఒక వారంలోనే 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అందులో ఐదుగురు గత 48 గంటల్లోనే ప్రాణాలు తీసుకున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

పేపర్ లీకేజీల సంక్షోభం కారణంగా తమ పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలన్నింటికీ మీ ప్రభుత్వం వెంటనే ఒక కోటి రూపాయల పరిహారాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అని దిప్కే రాశారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం మరియు వారి కలలను నిజం చేయడం కోసం ఎంతోమంది తల్లిదండ్రులు భారీగా విద్యా రుణాలు తీసుకున్నారని అయితే వ్యవస్థాగత లోపాల వల్ల వారి కలలు క్రూరంగా విచ్ఛిన్నమయ్యాయని దిప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రీ-ఎగ్జామినేషన్ల ఒత్తిడి యువతపై తీవ్రంగా పడుతోందని…దీనివల్ల ఈ ఘోరమైన ఆత్మహత్యల ధోరణి మరింత పెరుగుతోందని హెచ్చరించారు.

పరీక్షలలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులమైన మేము కోరుకునేదల్లా.. కోల్పోయిన ప్రాణాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించడమే అన్నారు. మిలియన్ల కొద్దీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మన విద్యా వ్యవస్థపై మళ్లీ నమ్మకం కలగాలంటే, నాయకత్వాన్ని జవాబుదారీ చేయడం చాలా ముఖ్యమైన అడుగు. ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి మరియు ఇందుకు బాధ్యులైన నాయకత్వాన్ని మార్చడానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం ఈ యథాతథ స్థితిని అంగీకరిస్తున్నట్లు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్నారు.

మే 3న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 21కి పరీక్షను రీషెడ్యూల్ చేయడంతో, అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరీక్ష రద్దు కావడానికి ముందు దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 2.27 మిలియన్ల (22 లక్షలకు పైగా) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఒకవైపు సీబీఐ (CBI) ఈ లీకేజీపై దర్యాప్తు జరుపుతుండగా.. మరోవైపు గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న విద్యార్థుల మరణాల వార్తలు ఈ వివాదం సృష్టించిన మానసిక వేదనను కళ్లకు కడుతున్నాయి.

డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల నీట్ అభ్యర్థిని మంగళవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె చదువులో ఎప్పుడూ ముందుండేదని (12వ తరగతిలో 96.7% మార్కులు మరియు కాలేజ్ టాపర్), రీ-నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో చదువుపై అసంతృప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు.

Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్

అహ్మదాబాద్‌లోని న్యూ రాణిప్ ప్రాంతంలో రీ-టెస్ట్‌కు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థి, బుధవారం తెల్లవారుజామున ఒక నివాస భవనం 6వ అంతస్తు నుండి పడి మరణించాడు.

గమనిక: ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే హెల్ప్‌లైన్: 1800-209-4353 (టోల్-ఫ్రీ) మరియు 9922001122)

- Advertisement -