కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుతం బూస్టర్ డోస్ (మూడో డోసు)పై చర్చ సాగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం దేశంలో అవసరమైన డేటా లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వచ్చే ఏడాది సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు.
వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలని చెప్పారు. ఇందుకుగానూ పరిశోధనలు జరపాలని, దీనికి మరి కొన్ని నెలలు సమయం పడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు వ్యాధి నుంచి రక్షణ పొందుతున్నారని ఆయన చెప్పారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారికి వైరస్ సోకితే వారు చికిత్స కోసం ఆసుపత్రుల వరకు వెళ్లే అవసరం ఉండట్లేదని వివరించారు.
బూస్టర్ డోస్ అవసరం ఉండవచ్చని తెలిపారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల నుంచి బూస్టర్ డోస్ మనకు అవసరమా అన్న విషయం తెలియాల్సి ఉందని అన్నారు. లేదంటే కొత్త వ్యాక్సిన్ తో బూస్టర్ డోస్ వేయాలా? అనే డేటా రావాల్సి ఉందని చెప్పారు. కాగా, పలు దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులు వేయాలని యోచిస్తోన్న విషయం తెలిసిందే. దీని వల్ల రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నాయి.