అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్…

240
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని తీర్పు వెలువడింది. చివరివరకు ఉత్కంఠబరితంగా సాగిన పోరులో వైట్ హౌస్‌ రారాజు ఎవరో తేలిపోయింది. అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికయ్యారు. సర్వేలన్ని హిల్లరీ గెలుపు నల్లేరుపై నడకే అని వెల్లడించినా…అంచనాలను తారుమారు చేస్తు ట్రంప్‌ విజయఢంకా మోగించారు. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ మెజార్టీ మార్క్కు చేరువయ్యారు.అమెరికా చరిత్రలో 70 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలివ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించాడు.

538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్‌ 276 ఓట్లు సాధించారు. కాగా విజయం ఖాయమని భావించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడ్డారు. మెజార్టీ మార్క్‌ 270 మార్క్ ని దాటి శ్వేతసౌదాధీశుడిగా నిలిచాడు.

ఓ పక్క ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠకు గురిచేస్తుంటే రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన అపార్ట్‌మెంట్‌లో కూర్చుని డైట్‌ కోక్‌ తాగుతూ.. టీవీలో ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్‌ స్నేహితుడు, న్యూయార్క్‌ మాజీ మేయర్‌ రూడీ గిలియానీ వెల్లడించారు.

Donald Trump creates History

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం మొదలైన ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్‌ ముందంజలో నిలిచారు. కాసేపటి తర్వాత హిల్లరీ ఆధిక్యం కనబరిచారు. ఆ వెంటనే ట్రంప్‌ దూసుకెళ్లారు. ఓ దశలో ట్రంప్‌ హిల్లరీ కంటే దాదాపు 57 ఓట్లు ఎక్కువ సాధించారు. ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నాడని తెలిసేసరికి భారత్‌ స్టాక్‌ మార్కెట్లు సహా ఆసియా, అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. 30 రాష్ట్రాల్లో ట్రంప్, 18 రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపొందారు.

విద్వేషకర, వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిల్లరీ 90 శాతం గెలిచే అవకాశముందని ఓటింగ్ ముందురోజు తుది సర్వే వెల్లడించింది. హిల్లరీయే గెలుస్తుందని మీడియా కూడా అంచనా వేసింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ వైట్ హౌస్‌లో కాలుమోపారు. కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా సహా వర్జీనియా, ఒహియో ట్రంప్‌ తన ఖాతాలో వేసుకున్నారు.

Donald Trump creates History

ఇకపై అమెరికాలోకి ముస్లింలను రానివ్వబోమని, తమ ఉద్యోగాలను లాక్కుంటున్న చైనా, భారత ఉద్యోగులను తరిమేస్తామని ట్రంప్ వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమెరికాలో తక్కువ చదువుకున్న నిరుద్యోగులు, పల్లె ప్రాంత ప్రజల మద్దతుతోనే ట్రంప్ అధికార పీఠానికి చేరువయ్యారు. సంప్రదాయ అమెరికన్ వాదాన్ని బలపరిచే వారంతా ట్రంప్ కు వెన్నుదన్నుగా నిలిచి ఓటేసి ఆశీర్వదించినట్టు స్పష్టంగా తెలుస్తోంది.తమ దేశంలోనే తాము నిరుద్యోగులుగా మారిపోతుండటాన్ని జీర్ణించుకోలేని శ్వేతజాతీయలు ట్రంప్ నే ఎన్కుకున్నట్లుగా ఫలితాలు తెలియజేస్తున్నాయి. వలస విధానంపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే అమెరికన్లు ట్రంప్ నే ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ గెలుపుతో హిల్లరీ వర్గీయులు నిరాశలో మునిగిపోయారు.

Donald Trump creates History

ఉగ్రవాద భయాలు పెరిగిన వేళ, ముస్లింలే టెర్రరిజానికి కారణమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గట్టిగా నాటుకు పోయాయని, మెక్సికో నుంచి వస్తున్న ముప్పును అరికట్టేలా గోడ కడతానని ఆయన చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియా, చైనా తదితర దేశాల నుంచి వివిధ రకాల వీసాలపై వస్తున్న వారిని అడ్డుకుని స్వదేశీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రంప్ చేసిన హామీలు నిరుద్యోగులను ఆకర్షించాయని, వీటన్నింటి ముందూ ఆయనపై వచ్చిన లైంగికారోపణలు తేలిపోయాయని పలువురు వ్యాఖ్యానించారు. అమెరికా వంటి దేశంలో లిబరల్ సెక్సీ లైఫ్ స్టయిల్ చాలా కామన్ కాబట్టి, ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు ఎంతమాత్రమూ ప్రభావం చూపలేదని ఆయన వర్గంలో ఉంటూ ప్రచార బాధ్యతలను పంచుకున్న ఓ యువతి వ్యాఖ్యానించింది.

- Advertisement -