అబ్రహం అకార్డ్స్ అంటే తెలుసా?

6
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న ‘అబ్రహం అకార్డ్స్’ (Abraham Accords) లో చేరాలన్న ఒత్తిడిని పాకిస్తాన్ బహిరంగంగా తిరస్కరించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నెలకొల్పే ఈ ఒప్పందంలో పాకిస్తాన్ చేరితే… దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో పాటు వారి జాతీయ పాస్‌పోర్ట్‌పై ఉన్న ఒక కీలకమైన నిబంధనను కూడా మార్చాల్సి వస్తుంది. అసలు ఈ అబ్రహం అకార్డ్స్ ఏమిటి, దీనివల్ల పాకిస్తాన్‌కు వచ్చే చిక్కులేంటో చూద్దాం.

అబ్రహం అకార్డ్స్ అనేది ఇజ్రాయెల్ మరియు అరబ్-ముస్లిం దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో (2020 లో) ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఒప్పందం. దీని కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, మొరాకో, సూడాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించి, రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ట్రంప్ ఈ కూటమిని మరింత విస్తరించాలని, ఇందులో పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాలను చేర్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ప్రపంచంలోని అన్ని దేశాల పాస్‌పోర్ట్‌లు సాధారణంగా అన్ని ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుమతిస్తాయి. కానీ పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌పై ఒక విచిత్రమైన వాక్యం ముద్రించబడి ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది అని ఉంటుంది. అయితే పాకిస్తాన్ గనుక ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేస్తే 75 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా చూస్తున్న విధానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే తమ పాస్‌పోర్ట్ నుండి ఇజ్రాయెల్ మినహాయింపు నిబంధనను పూర్తిగా తొలగించాలి. దీనివల్ల పాకిస్తాన్ పౌరులు నేరుగా ఇజ్రాయెల్ లేదా జెరూసలేం సందర్శించడానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా ఇస్లామాబాద్, టెల్ అవీవ్ నగరాల మధ్య నేరుగా దౌత్య సంబంధాలు, విమాన రాకపోకలు ప్రారంభమవుతాయి.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా పూర్తిస్థాయి స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు తాము ఇజ్రాయెల్‌ను గుర్తించబోమని పాకిస్తాన్ స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే దేశంలో తీవ్రమైన అంతర్గత తిరుగుబాట్లు, మతపరమైన నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో ఇస్లామాబాద్ ఈ నిర్ణయానికి మొగ్గు చూపడం లేదు.

Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!

- Advertisement -