కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ఊహించని రీతిలో భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి భక్తజనం భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 80,000 నుండి 98,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది.
క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించింది. భక్తుల సేవలో భాగస్వామ్యం చేయడానికి శ్రీవారి సేవకుల సంఖ్యను గతంలో ఉన్న 2,500 నుండి ఏకంగా 3,500కు పెంచింది. ఈ అదనపు సిబ్బంది సేవకులు క్యూలైన్లలోనే నిరంతరాయంగా అన్నప్రసాదాలు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు పాలు ఉప్మా పొంగల్ పులిహోర అందిస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు.
క్షేత్రానికి వస్తున్న భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉండటంతో కళ్యాణకట్టలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతిరోజూ రికార్డు స్థాయిలో 40,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. భక్తులకు గుండు గీసే సమయంలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి టీటీడీ అదనపు క్షౌరకులను నియమించింది. నిరంతరాయంగా టోకెన్ల జారీ తలనీలాల సమర్పణ ప్రక్రియ సాగుతోంది. తిరుమల కొండపై ఉన్న అన్ని సేవా కేంద్రాలు భక్తుల రద్దీకి అనుగుణంగా 24 గంటలు పనిచేస్తున్నాయి.
Also Read:పెద్ది..చరణ్ విశ్వరూపం చూస్తారు!

