సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి.. అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయి. వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారు అన్నారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్లు వడ్లు కొనాలని ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు రోడ్డెక్కుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సీఐ లెవీ కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసి ఇద్దరూ కలిసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు, వడ్ల కొనుగోళ్లకు ఏనాడూ ఇబ్బంది రాలేదు అన్నారు.
ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలతో బంగారం లాంటి పంటలు పండిస్తే.. ఇవాళ కొనేవాడు లేక ఆ పంట అమ్ముకోవడం రైతులకు కష్టమైపోయింది.సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయి. కానీ ఈ ప్రభుత్వం ఆన్ లైన్ ట్యాగింగ్, కొత్త రూల్స్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించింది.రాష్ట్రంలో 80% వడ్లు కొన్నాం అని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఏసీ రూముల్లో కూర్చుని చెబితే నిజాలు తెలియవు. ఏ మార్కెట్ కి పోయినా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే ముగ్గుతోంది.అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తడిసిన వడ్లు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయి. వెంటనే ముఖ్యమంత్రి గారు, మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహసీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి.. తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి అన్నారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి.రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని, లేకపోతే మిల్లుల దగ్గరకు రావొద్దని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరే మిల్లర్లతో మాట్లాడుకోండని చేతులెత్తేస్తున్నారు.ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్ కింద రాస్తూ ఎకరాకు రూ. 6700, అలాగే క్వింటాల్ కు 3 నుంచి 5 కిలోల తరుగు పేరుతో మరో రూ. 3000.. వెరసి ఒక్కో రైతు రెండు రకాలుగా వేలాది రూపాయలు నష్టపోతున్నాడు. రవాణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలు, ట్రాక్టర్ల వెయిటింగ్ ఛార్జీలు, కాంటా డబ్బులు అన్నీ రైతుల నెత్తినే రుద్దుతూ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.తొలుత 90 లక్షల టన్నులు కొంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షలే కొంటాననడం సిగ్గుచేటు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే, కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇచ్చింది.బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాదు.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా కొట్లాడాలి.ఆనాడు కేంద్రం కోటా ఇవ్వనప్పుడు కేసీఆర్ గారు మంత్రులతో సహా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. సన్ ఫ్లవర్, జొన్నలు, శనగలు కేంద్రం కొనకపోయినా రైతులు నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కేసీఆర్ గారు కొనుగోలు చేశారు. ఇప్పుడు రెండు నెలలుగా సన్ ఫ్లవర్ కొనకపోవడంతో చెదలు పడుతోంది. కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది.వానాకాలం వస్తున్నా ఇంతవరకు జీలుగ, జనుము విత్తనాలు, ఎరువుల స్టాక్ రెడీ చేసుకోలేదు. వ్యవసాయం, రైతులు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగానే లేవు.కేంద్రం మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి 3 వేల కోట్ల భారం మోపితే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ (VAT) పెంచి మరో 2 వేల కోట్ల భారం మోపింది. ఇద్దరూ కలిసి 5 వేల కోట్లు దోచుకుంటూ రైతుల, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.ధర్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ముందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 27% వ్యాట్ ను 10%కి తగ్గించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.బక్రీద్ పండుగ వస్తుండటంతో లారీ డ్రైవర్లు దొరకరు. కాబట్టి ప్రభుత్వం వారం రోజుల పాటు ఇసుక తవ్వకాలను, రవాణాను ఆపివేసి.. వేలాదిగా ఉన్న ఆ ఇసుక లారీలను ఆ ఇసుక లారీలను, ఆర్టీఏ అధికారులను వడ్ల రవాణాకు కేటాయించాలి.ప్రభుత్వానికి రైతులు ముఖ్యమా? ఇసుక మీద వచ్చే ఆదాయం ముఖ్యమా? తేల్చుకోవాలి అని డిమాండ్ చేశారు.

