అతను జిల్లా కలెక్టర్.. ఎవరికి కష్టం వచ్చినా అతనికే చెప్పుకుంటారు. ఎవరికి న్యాయం కావాలన్నా అతని దగ్గరకే వెళతారు.. అందరి సమస్యలను పరిష్కరించే శక్తి అతనికుంది. ఇదంతా ఆయన వృత్తి జీవితం. కానీ నిజజీవితంలో మాత్రం ఆయన తన సమస్యలకు తలవంచాడు. తన చావుకు ఎవరు బాద్యులు కాదంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తె.. బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు ముఖేశ్ పాండే. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. 2012 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. రెండు రోజులుగా కనిపించని పాండే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో రైలు పట్టాలపై శవంగా కనిపించారు. వేగంగా వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. జేబులో ఉన్న కాగితం ఆధారంగా అతన్ని గుర్తించారు.
ముఖేశ్ పాండే అనే నేను.. 2012 బ్యాచ్ IAS అధికారిని. బీహార్ క్యాడర్. ప్రస్తుతం బక్సర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నాను. ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావును మా కుటుంబ సభ్యులకు తెలియజేయండి అని రాశారు. మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదు. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని రాశారు.
ఆత్మహత్యకు ముందు తన ఫ్రెండ్స్ తో మాట్లాడాడు కలెక్టర్ ముఖేశ్ పాండే. తన నిర్ణయాన్ని చెబితే వాళ్లు చెప్పాడు. ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకుతున్నట్లు చెప్పాడు. వాళ్లు వద్దని వారించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. రంగంలోకి దిగిన పోలీసులు.. షాపింగ్ మాల్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈలోపు కలెక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
2012 బ్యాచ్ కు చెందిన ముఖేశ్ పాండే.. ఈ ఏడాది ఆగస్టు 4న బక్సర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పాండే మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. పాండే సమర్థవంతమైన అధికారి అని నితీష్ కొనియాడారు.