గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసీ గెలిపించాలన్నారు సినీ దర్శకుడు ఎన్.శంకర్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన శంకర్..టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు.
ఓట్ల కోసం మనుషులను మత,కులాల వారీగా విడగొట్టవద్దని బీజేపీ నాయకులకు సూచించారు. హైదరాబాద్‌కు మతకలహాల చేదు అనుభవం మళ్లీ అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు బతుకమ్మ, పీరీల పండుగ కలిసి జరుపుకుంటున్నారన్నారు.
బీజేపీ హిందువుల పార్టీని ఓ ఎంపీ ప్రకటించాడు….నేను హిందువును అయితే బీజేపీలో ఉండాలా? అని శంకర్ ప్రశ్నించారు. వేదాలను గౌరవిస్తే.. గోమాతను పూజిస్తే శవభాష మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో 350 వరకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని, అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కే ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారన్నారు.
ప్రపంచంలోని ఐదు టాప్ ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, తెలంగాణ రాక ముందు ఒకే సంస్థ ఉండేదని గుర్తు చేశారు.హైదరాబాద్ మహానగరానికి రాబోయే 30 ఏళ్లలో తాగునీటి సమస్య లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. ఇంతటి విజన్ ఉన్న నాయకుడిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని హైదరాబాద్ ఓటర్లను ఆయన కోరారు.