నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన `వెళ్ళిపోమాకే` చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో ని ఇటీవలే హైదరాబాద్ లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్చి 10 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ , ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 17 న విడుదల చేయాలనీ నిర్ణయించారు.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. వెళ్ళిపోమాకే సినిమా మేకింగ్ చాలా బాగా నచ్చింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని దర్శకుడు యాకూబ్ అలీ చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి తగిన విధంగా నటీనటులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు.
విశ్వక్ సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య సాగే ఫీల్ గుడ్ మూవీ యాకూబ్ అండ్ టీం కలిసి, కొత్తగా చేసిన ప్రయత్నమే `వెళ్ళిపోమాకే` . దర్శకుడు నటీనటుల నుండి పెర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్న తీరు బాగా నచ్చింది.
హీరో విశ్వక్ సేన్ అనుపమ్ ఖేర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రయినింగ్ తీసుకున్నాడు. అలాగే డైరెక్టర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో ట్రయినింగ్ తీసుకున్నాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న యంగ్ టీంను ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. మార్చి 17 న విడుదల చేస్తున్నాము “ అన్నారు.
దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండున్నర సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాం. నాకున్న బడ్జెట్ పరిమితుల్లో, వనరులతో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా నచ్చి దిల్ రాజు సినిమాను విడుదల చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.