బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా రావడం వల్ల తనకు పెద్ద షాట్లు ఆడాల్సిన అవసరం రాదని, ఇన్నింగ్స్ నిలబెడితే అటు లోయర్ ఆర్డర్‌లో వచ్చే యువ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి కూడా తగ్గుతుందని కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ దోని అన్నాడు. ఐదు లేదా ఆరు నంబర్లలో బ్యాటింగ్‌కు రావడం వల్ల గతంలోలాగా స్ట్రైక్‌ను రొటేట్ చేయలేకపోతున్నానని.. అందుకే మొహాలీ వన్డేలో నంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగానని ధోని చెప్పాడు.
నంబర్ 4లో ఆడటానికి మరికొంతమంది యువ బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉన్నా.. ఇప్పుడు నంబర్ 5, 6లో ఆడే సామర్థ్యాన్ని వారిలో పెంచాలని ధోనీ చెప్పాడు. ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్న మిస్టర్ కూల్.. తన బ్యాటింగ్ మునుపటిలా లేదని నిజాయతీగా అంగీకరించాడు. మూడో వన్డే ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో మాట్లాడుతూ.. టీమ్ అవసరాల కన్నా తన అవసరం కోసమే బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందినట్లు కుండబద్దలు కొట్టాడు ధోని.
తన కోసమే నంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగానని ధోనీ చెబుతున్నా.. అది టీమ్‌కు ఎంతగానో ఉపయోగపడింది. అతను 11 ఇన్నింగ్స్ తర్వాత ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది ఎంతో కీలక సమయంలో వచ్చింది. ఈ ఇన్నింగ్స్ అతని కాన్ఫిడెన్స్‌ను పెంచింది. పరుగుల కోసం చాన్నాళ్లుగా తపిస్తున్న ధోనీ.. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. టీమ్‌లో సీనియర్‌మోస్ట్ బ్యాట్స్‌మన్‌గా నంబర్ 4లో తన అవసరం ఏంటో చాటి చెప్పాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు కూడా ఇదే అనుకుని ఉంటారు. ముందుగా టీమ్‌తో చర్చించిన తర్వాతే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ధోనీ స్పష్టంచేశాడు.
గత ఏడాదిన్నరగా టాపార్డర్ మంచి ఫామ్‌లో ఉండటం వల్ల కూడా లోయర్ ఆర్డర్‌లో వచ్చే ధోనికి అంతగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. అటు టెస్టుల నుంచి కూడా రిటైరవడంతో ఓవరాల్‌గా మునుపటి ధోని ఏమయ్యాడన్న ఆందోళన అటు అభిమానుల్లోనూ మొదలైంది. టెస్టులే కాదు వన్డేల్లోనూ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్న విమర్శలూ వచ్చాయి. కానీ ఒక్క ఇన్నింగ్స్‌తో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు ధోనీ.