ఢిల్లీ ప్రజలకు బీజేపీ మంత్రి క్షమాపణలు

2
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్య నియంత్రణలో భాగంగా వాహనాలపై ఆంక్షలు విధించాల్సి రావడంపై ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు తక్కువ స్థాయి ఉన్న వాహనాలపై నిషేధం విధించాల్సి వచ్చిందని వెల్లడించారు.

మీడియాతో మాట్లాడిన మంత్రి సిర్సా.. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలిత పంజాబ్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలను నియంత్రించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విధానాలు కూడా ప్రస్తుత కాలుష్య పరిస్థితికి కారణమయ్యాయని ఆరోపించారు.

పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం ఘటనలకు సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తూ.. నవంబర్ 3న ఒక్కరోజే 584 ఘటనలు నమోదయ్యాయని సిర్సా తెలిపారు. నవంబర్ 2 వరకు ఈ సంఖ్య తక్కువగా ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిందని పేర్కొన్నారు. పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం బర్నాలాలో గాలి నాణ్యత సూచీ (AQI) 1,200గా, బఠిండాలో 1,100గా, సంగ్రూర్‌లో 1,007గా నమోదైందని వెల్లడించారు.

పంజాబ్‌లో కాలుష్యాన్ని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించి 494 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. రైతులపై కేసులు నమోదు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదని, పంట వ్యర్థాల దహనానికి దారితీస్తున్న కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర

- Advertisement -