దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజే గాలి నాణ్యత మరింత క్షీణించింది. సోమవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించిన వివరాల ప్రకారం.. పలు ప్రాంతాలు తీవ్ర కాలుష్య విభాగంలోకి చేరాయి.
ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. దీంతో రహదారులపై వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఐటీఓ ప్రాంతంలో తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో ఏక్యూఐ 406గా నమోదైంది. ఘాజీపూర్‌లో 418, బురారీ క్రాసింగ్‌లో అత్యధికంగా 441గా రికార్డైంది. వివేక్ విహార్‌లో 437, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ వద్ద 434, నార్త్ క్యాంపస్, జహంగీర్‌పురిలో 433 చొప్పున నమోదయ్యాయి. రోహిణిలో 430, ముండ్కాలో 417, పంజాబీ బాగ్‌లో 409గా కాలుష్య స్థాయులు ఉన్నాయి.
మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో దశ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్మాణ పనులపై ఆంక్షలు, వాహనాల రాకపోకలపై పరిమితులు, ఇతర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా ముంబైలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సోమవారం ఉదయం అక్కడ సగటు ఏక్యూఐ 170గా నమోదైంది. ఇది మోస్తరు కాలుష్య స్థాయిగా పరిగణిస్తారు. గత ఏడాదితో పోలిస్తే దీపావళి సమయంలో ముంబై గాలి నాణ్యత 30 శాతం మెరుగ్గా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
సాధారణంగా ఏక్యూఐ 401 నుంచి 500 మధ్య ఉంటే తీవ్ర కాలుష్యంగా పరిగణిస్తారు. దీపావళి బాణసంచా పొగతో పాటు వాహనాల ఉద్గారాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ALso read:‘దశావతారం’..రీ-రిలీజ్

