దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం నగరంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉదయం 8:01 గంటల సమయంలో ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 482గా నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్ర (Severe) కాలుష్య స్థాయికి చేరినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించింది.
సీపీసీబీ గణాంకాల ప్రకారం.. ఢిల్లీలోని ఏడు పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 400 దాటింది. పంజాబీ బాగ్‌లో అత్యధికంగా 446 ఏక్యూఐ నమోదైంది. నరేలాలో 434, రోహిణిలో 431, ఆర్కే పురంలో 416, బవానాలో 412, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో 408, పట్పర్గంజ్లో 405 ఏక్యూఐ నమోదయ్యాయి.
ఇక ఇతర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత ఆందోళనకరంగానే ఉంది. ఓఖ్లా ఫేజ్-2, ఇండియా గేట్ ప్రాంతాల్లో 399 చొప్పున ఏక్యూఐ నమోదైంది. ఐటీఓలో 397, ద్వారకా సెక్టార్-8లో 396, చాందినీ చౌక్‌లో 356, వసుంధర ఎన్‌క్లేవ్‌లో 330గా నమోదైంది. ఆనంద్ విహార్‌లో 293, లోధీ రోడ్లో 268 ఏక్యూఐ నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్ (Poor) కేటగిరీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. గాలి దిశ, వేగం, వాతావరణ పరిస్థితులు, గాలి కదలికలను ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Also Read:‘ఇట్లు అర్జున’ కోసం ఎన్టీఆర్..!
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలు గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగానే కొనసాగుతోంది. ఈ ఏడాది వరి పంట వ్యర్థాల్లో సుమారు 40 శాతాన్ని ఇతర పద్ధతుల ద్వారా వినియోగించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ వాతావరణ పరిస్థితులు, గాలి ప్రసరణ వంటి అంశాల కారణంగా కాలుష్య తీవ్రత కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.

