దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న ఏబీడీ తన నిర్ణయాన్ని సఫారీ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. డివిలియర్స్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి డివిలియర్స్‌ను తప్పించాలన్న వార్తలు వెలువడుతుండగానే తానే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన డివిలియర్స్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమని అన్నాడు. ప్రస్తుతం జట్టుకు కొత్త కెప్టెన్ అవసరమని, కెప్టెన్ ఎవరైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని డివిలియర్స్ ఈ సందర్భంగా ప్రకటించాడు.టెస్టుల్లో డుప్లెసిస్ కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టు నిలకడగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కూడా డుఫ్లెసిస్‌కు ఇవ్వాలని ఏబీ సూచించాడు.
మూడు ఫార్మెట్లలో ఆడటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని భావించిన డివిలియర్స్ ఈ ఏడాది జనవరిలోనే టెస్టు ఫార్మట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అయితే, ప్రస్తుతం తాను అన్ని ఫార్మెట్లలో ఆడేందుకు సిద్దమని ప్రకటించాడు.
Looking forward to a great summer #ProteaFire pic.twitter.com/yojybIrvjZ
— AB de Villiers (@ABdeVilliers17) August 23, 2017