పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.
న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడంలో భాగంగానే లీగల్ పోరాటం చేశానని, తీర్పు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-Defection Law) ప్రకారం లీగల్‌గా నాకు కొంత ఊరట లభిస్తుందని భావించి చట్టపరమైన ప్రయత్నం చేశాను. కానీ ఈ రకమైన ఫలితం వస్తుందని నేను ముందే ఊహించాను.”
నా రాజకీయ జీవితంలో ఎన్నికలు, పోరాటాలు కొత్తేమీ కాదు. ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. తిరిగి ప్రజా క్షేత్రంలోకి వెళ్తాను అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో నాకు దశాబ్దాలుగా ప్రత్యేకమైన సాన్నిహిత్యం ఉంది. వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగమయ్యాను. ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదం, మద్దతు నాకే ఉంటాయి అన్నారు.
Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్
బిఆర్ఎస్ బి-ఫామ్‌పై గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించగా ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది.

