ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, రాగల రెండు రోజులు కొనసాగనున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీనియర్ అధికారులతో పాటు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల పాలనా యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు మరియు వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలను తక్షణమే పునరుద్ధరించి రాకపోకలకు మరియు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, వాగులు, వంకలు పొంగిపొర్లే ముంపు గ్రామాల ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలు మరియు పునరావాస కేంద్రాలకు తరలించాలి అని సూచించారు.
వర్షాల ధాటికి చెరువులకు గండ్లు పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయి నుంచి నిమిష నిమిషం సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులకు రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి, ట్రాఫిక్‌కు ఎక్కడా అవరోధం కలగకుండా అత్యవసర బృందాలు పనిచేయాలి.వరద సాయం మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను వేగవంతం చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్

