ఏపీలో నివర్ తుపాన్ బీభత్సం సృష్టించింది. రైతులను నిలువునా ముంచిన నివర్ భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరి,పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికందే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం రంగుమారి గిట్టుబాటు ధర రాదనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు వాతామరణశాఖ తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక నివర్ తుఫాన్ దెబ్బకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.