బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వేగంగా కదులుతోంది. ఇది మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా గాలుల వేగం అప్పుడప్పుడు 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది.
తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలోనూ అక్టోబర్ 28న భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా తుపాను ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది.
తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని, కోతలు పూర్తయిన వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు.
Also Read:ఆ ట్రిక్‌ను మిస్ అయ్యారు!
ఒడిశాలోనూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు.

