తెలంగాణ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడి ఈ చలానా జారీ అయి చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. మార్చి 1 నుండి 30 వరకు వాహనాల ఆధారంగా 80, 75, 70, 50 శాతం చొప్పున రాయితీ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
మీ సేవ, ఈ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపారు. రెండు కమిషనరేట్ల పరిధిలో 2 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా ఇది వాహనదారులకు ఎంతగానో ఊరట కలిగించనుంది.
బైక్, ఆటోలపై ఉన్న జరిమానాలలో 75 శాతం రాయితీ, తోపుడు బండ్లపై ఉన్న కేసులపై 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ, కార్లు, మిగతా వాహనాలకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇవ్వనున్న భారీ రాయితీ ఎంతో ఉపయోగపడుతుందని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలో రూ. 600 కోట్ల విలువైన సుమారు 2 కోట్ల వరకు ఈ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లను ఆన్‌లైన్‌లో చెల్లించేలా ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.