మాజీ ప్రధాని కుమారుడికి సైబర్ షాక్

0
- Advertisement -

భారత మాజీ ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ గుజ్రాల్ సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆయనలా నటించి…ఆయన కంపెనీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కాంటాక్ట్‌లను మార్చడం ద్వారా ఏకంగా రూ. 7.8 కోట్లు దోచేశారు.అయితే పోలీసులు ఇప్పటివరకు మోసపోయిన మొత్తంలో రూ. 4 కోట్లను ఫ్రీజ్ చేయగలిగారు.

సైబర్ నేరగాళ్లు ఒక మెసేజింగ్ యాప్‌లో నరేష్ గుజ్రాల్ ప్రొఫైల్ చిత్రాన్ని (DP) ఉపయోగించి ఆయన పేరుతో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు. నిందితులు ముందుగా గుజ్రాల్ కంపెనీలోని ఒక ఉద్యోగికి ఒక హానికరమైన ఫైల్ పంపించి అతడి మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఫోన్ యాక్సెస్ లభించిన తర్వాత నిందితులు ఆ ఉద్యోగి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న గుజ్రాల్ అసలు నంబర్‌ను తీసేసి ప్రొఫైల్ పిక్చర్ అలాగే ఉంచి తమ సొంత నంబర్‌ను మార్చేశారు. దీనివల్ల నిందితులు పంపే మెసేజ్‌లు గుజ్రాల్ పంపుతున్నట్లే కనిపించాయి.

అత్యవసర వ్యాపార అవసరాల నిమిత్తం అంటూ RTGS ద్వారా డబ్బులు బదిలీ చేయాలని ఆ ఉద్యోగికి నిందితులు మెసేజ్ పంపారు. అది నిజంగా గుజ్రాల్ పంపిన మెసేజ్ అని నమ్మి, ఆ ఉద్యోగి నాలుగు విడతల్లో మొత్తం రూ. 7.8 కోట్లను బదిలీ చేశాడు. ఇది సాధారణ వ్యాపార లావాదేవీల లాగే జరగడంతో మొదట్లో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అవుతుండటాన్ని గమనించిన బ్యాంక్ అధికారులు..కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అనుమతి కోరారు. ఆ మెసేజ్‌లు గుజ్రాల్ పంపినవేనని నమ్మిన CFO కూడా ఆ లావాదేవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

చివరకు జూన్ 16న కంపెనీ అధికారి ఒకరికి అనుమానం వచ్చి ఈ పేమెంట్ల గురించి నిర్ధారించుకోవడానికి గుజ్రాల్ కుమార్తెను సంప్రదించారు. ఆమె తన తండ్రిని అడగ్గా తాను అలాంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదని గుజ్రాల్ స్పష్టం చేశారు. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వెంటనె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గార్మెంట్ బిజినెస్ నడుపుతున్న నరేష్ గుజ్రాల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను అందుబాటులో లేని సమయంలో తన CFO దురదృష్టవశాత్తూ ఈ స్కామ్ బారిన పడ్డారని తెలిపారు. దోచుకున్న డబ్బును వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లోకి నాలుగు లావాదేవీల ద్వారా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే..ఇరాన్ వార్నింగ్!

- Advertisement -