గ్రూప్ IV పోస్టుల భర్తీపై సీఎస్ స‌మీక్ష‌..

48
CS Somesh Kumar
- Advertisement -

రాష్ట్రంలో గ్రూప్ IV కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో గ్రూప్ IV పోస్టుల నోటిఫికేషన్ జారీపై గురువారం సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రూప్IV కు సంబంధించి రోస్టర్ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందజేయాలని, అన్ని జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్‌లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగింది. గ్రూప్ I కింద 503 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సిఎస్ తెలిపారు.

ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ACB డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, TSPSC కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్, మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -