ఒక సినిమా కథ ఎవరి దగ్గరకు వెళ్లాలి, ఎవరు హీరోగా నటించాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ ఒకరిది అయితే, తీరా సెట్స్ పైకి వెళ్లేసరికి మరొకరి చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో సహజం. మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘క్రాక్’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
2021 సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథను మొదట రవితేజ కోసం అనుకోలేదట. నందమూరి బాలకృష్ణను దృష్టిలో ఉంచుకుని ఈ కథను సిద్ధం చేశానని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఇటీవల ఒక కార్యక్రమంలో వెల్లడించారు.
సి. కళ్యాణ్ నిర్మాణంలో బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలని భావించారు. కానీ, ఆ సమయంలో బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబో ముందుకు సాగలేదు. దాంతో అదే కథను గోపీచంద్ మలినేని రవితేజ వద్దకు తీసుకెళ్లడం, వేరే నిర్మాతతో ‘క్రాక్’గా తెరకెక్కించడం జరిగాయి.
మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రం రవితేజకు గ్రాండ్ రీ-ఎంట్రీని ఇచ్చి, భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కలయికలో ‘వీరసింహారెడ్డి’ (2023) రూపొంది, అది కూడా సంక్రాంతికి విడుదలటై సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలయ్యతో చేయాల్సిన కథ రవితేజ చేతికి వెళ్లి హిట్టవ్వడం, ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వేరొక హిట్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Also Read:ఇంటర్నేషనల్ కాఫీ డే..ప్రత్యేకం

