తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ హీరో పేరు చర్చకు వస్తోంది. స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతుండగా.. తాజాగా డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
తమిళనాడులో సినీ, రాజకీయ రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా హీరో విజయ్ కూడా తమిళగ వెట్రి కజగం (టీవీకే)ను ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఈ నేపథ్యంలో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇటీవల రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్నకు ధనుష్ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ వెళ్లిపోవడం కూడా చర్చకు దారితీసింది. జూలైలో అభిమానుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అభిమానుల ఐక్యతను కేవలం సినిమా వేడుకలకు పరిమితం చేయకుండా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం అభిమాన సంఘాల కార్యకలాపాలు కూడా విస్తరించడం గమనార్హం.
ఇక తాజాగా ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కనిమొళి.. విజయ్ ప్రభుత్వ ఎన్నికల హామీలను విమర్శిస్తూ ధనుష్ నటించిన ‘వేలైల్లా పట్టదారి’ సినిమాను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ధనుష్ పేరును రాజకీయ వ్యాఖ్యల్లోకి తీసుకురావడం చర్చనీయాంశమైంది.
Also Read:ఓటు హక్కుపై గాంధీజీ తొలి పోరాటం
కనిమొళి వ్యాఖ్యలు ధనుష్‌కు రాజకీయంగా ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాయన్నదానిపై తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ధనుష్ సొంత పార్టీ పెడతారా, ఏదైనా పార్టీలో చేరతారా, లేక రాజకీయాలకు దూరంగానే ఉంటారా అనేది ఆయన స్వయంగా ప్రకటించే వరకు స్పష్టత రానుంది.

