కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాలపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఎం.ఏ. బేబీ తీవ్రంగా విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్వతంత్రంగా పనిచేయడం లేదని, అది కేవలం ఆర్‌ఎస్‌ఎస్ (RSS), బీజేపీకి జేబు సంస్థలా మారిందని ఆయన ఆరోపించారు.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో పినరయి విజయన్ కుమార్తె వీణ తైకండియిల్ ఐటీ సంస్థ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ ఆర్థిక లావాదేవీలపై బుధవారం ఈడీ అధికారులు కేరళవ్యాప్తంగా 13 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ పరిణామంపై స్పందించిన ఎం.ఏ. బేబీ… ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పద్ధతులను అవలంబిస్తోందని మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లేదా బలమైన ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అనేది ఒక స్వతంత్ర సంస్థ కాదు… అది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక విభాగంగా పనిచేస్తోంది. కేరళలో ప్రజాదరణ పొందిన నాయకులపై, వారి కుటుంబాలపై బురదజల్లేందుకే ఈ తనిఖీలు చేస్తున్నారు అని ఆరోపించారు.
Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!
పియరి విజయన్ కుమార్తె వీణకు చెందిన సంస్థకు సీఎంఆర్‌ఎల్ (CMRL) నుండి రూ. 1.72 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది.

