గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ‘దిశ’ నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తాజాగా ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. నిందితులను ఎక్కడైతే ఎన్‌కౌంటర్ చేశారో అక్కడే సీపీ మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు.
నవంబర్ 27న రాత్రి దిశను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున షాద్‌నగర్ చటాన్‌పల్లి వద్ద దిశను కాల్చేశారు. షాద్‌నగర్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండల వాసులను నిందితులుగా గుర్తించి నవంబర్ 30న మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచాం. 30న సాయంత్రం చర్లపల్లి జైలుకు తరలించాం. ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్నాం. 3వ తేదీన 10 రోజుల కస్టడీకి అనుమతించారు. 4వ తేదీన పోలీసు కస్టడీకి తీసుకున్నాం. 4, 5వ తేదీల్లో నిందితులను విచారించాం. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు వెల్లడించారు.
బాధితురాలి వాచ్, సెల్‌ఫోన్ గురించి చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్‌పల్లికి తీసుకువచ్చాం. సెల్‌ఫోన్ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేయడం జరిగింది. పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్‌కు యత్నించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైర్ చేశారు పోలీసులు. కరుడుగట్టిన నేరస్తులు వీళ్లు. ఏ1 ఆరిఫ్ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేశాం. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించాం. వేరే రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో నిందితులు దాడులు చేశారు అని సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు.