దేశవ్యాప్తంగా పశువుల వధను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పశువుల అమ్మకాలపై ఆంక్షలను విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రి త్వశాఖ శుక్రవారం ఓ అధికారిక గెజిట్ను వెలువరించింది. కేవలం పాడి, పొలం పను ల కోసమే పశువులను సంతలకు విక్రయించేందుకు తీసుకువెళ్లుతున్నామనే నిర్థిష్ట రాతపూర్వక హామీ పత్రంతో పాటు కఠిన నిబంధనలు తీసుకురావడంతో అంతా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
దీంతో ఇప్పుడు ఆన్ లైన్లో పశువుల అమ్మకాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు ఏవైనా సెకండ్ హ్యండ్ వస్తువులను అమ్మాలన్నా .. కొనాలన్నా ఇటివల మనకు గుర్తుకొచ్చే యాప్ ఓఎల్ఎక్స్ . ఫోన్లు .. ద్విచక్ర వాహనాలు .. ఫర్నీచర్ మొదలు పలు రకాల వస్తువుల వరకు అన్నింటిని ఇందులో పెట్టి అమ్మేస్తుంటారు. అయితే ఇప్పటివరకు మనం ఈ సైట్ లో వస్తువులను అమ్మడం మాత్రమే చూశాము. ఇకపై అవులను కూడా ఓఎల్ఎక్స్లో అమ్మడానికి సిద్ధమయ్యారు రైతులు, పశువ్యాపారులు.
ఓఎల్ఎక్స్లో యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాదు మరోవైపు ‘ఈ-కామర్స్’ సైట్ ‘క్వికర్’లో ఇటీవల ఆవు పిడకలకు సంబంధించిన ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. ‘స్వచ్ఛమైన ఆవుపేడతో తయారు చేసిన పిడకల కోసం సంప్రదించండి’ అంటూ వస్తున్న యాడ్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మరి వీటిపై కేంద్రం ఏవిధమైన ఆంక్షలు విధిస్తుందో చూడాలి.