రివ్యూ: కోర్టు

10
- Advertisement -

వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కోర్టు.

కథ:

చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్‌లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్‌లో బైక్ కూడా తీసుకుంటాడు. అలాంటి చందు లైఫ్‌లోకి జాబిల్లి (శ్రీదేవీ) వస్తుంది. వీరి పరిచయం ప్రేమగా మారగా విషయం ఇంట్లో వాళ్లకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది?, పోక్సో చట్టం ఎందుకు నమోదు చేశారు?, చివరకు ఏం జరుగుతుంది అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు. చాలా ఏళ్లకు శివాజీకి అదిరిపోయే పాత్ర దక్కింది. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశాడు. మంగపతి పాత్రకే ఎక్కువగా విజిల్స్ పడతాయి. ప్రియదర్శి తన సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. హర్ష వర్దన్, సాయి కుమార్ సీనియర్ లాయర్లుగా అద్భుతంగా కనిపిస్తారు. కుర్రాడి తల్లిగా ప్రభావతి, అమ్మాయి తల్లిగా రోహిణి పాత్రలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్‌:

జై భీమ్ రేంజ్‌లో ఎమోషన్స్‌ను కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయిలో సినిమా ఆకట్టుకోదు. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లోనే జరుగుతుంది. సెకండాఫ్‌కి పాత్రలు చాలా డల్ అయిపోతాయి. ఆ రెండు పాత్రలు అసలు ఎక్కువగా కనిపించవు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలు, కొట్టిన ఆర్ఆర్ ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. 2013లో జరిగే ఈ కథకు కెమెరామెన్ మంచి విజువల్స్ అందించారు. కోర్ట్ సెట్ కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. నాని నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

నిర్మాతగా నాని ఓ మంచి సబ్జెక్ట్, పాయింట్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. పోక్సో చట్టం మీద అవగాహన లేక, చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలీక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇలా చేస్తే తప్పు.. అది చేస్తే నేరం అని విడమరిచి చెప్పి, చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మొత్తంగా ఈ వీకెండ్‌లో అంతా చూడదగ్గ చిత్రం కోర్టు.

విడుదల తేదీ: 13/03/2025
రేటింగ్:2.75/5
నటులు:రోషన్,శ్రీదేవీ,ప్రియదర్శి,శివాజీ
దర్శకుడు: రామ్ జగదీష్
నిర్మాత: నాని

- Advertisement -