కార్పోరేట్ మాయాజాలం..

256
- Advertisement -

కార్పొరేట్ మాయాజాలం అంతా ఇంతా కాదు. మన రోజువారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి తర్వాత అదే అద్భుతమన్నట్లు మనకు నేర్పించడమే కార్పోరేట్ కల్చర్.అందుకే కార్పోరేట్ సంస్థలు ఆ రంగం ఈ రంగం కాదు అన్ని రంగాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కల్తీ పాలను మనకు అలవాటు చేసి స్వచ్ఛమైన పాలు అంటూ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి..మనకు అవసరం ఉన్నా లేకపోయినా గోబెల్స్ ప్రచారంతో మనల్ని అలవాటు పడేలా చేసి తర్వాత డబ్బుల రూపంలో క్యాష్ చేసుకుంటున్నాయి. ఎంతలా అంటే వేప పుల్ల దగ్గరి నుండి మన సంస్కృతిలో భాగమైన పండుగలు, వాటి ఆచారాలను క్యాష్ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో పండగ చేసుకుంటున్నాయి. చివరికి పిడకలను కూడా అమ్ముకుంటూ అదేదో మన మంచికే అన్నట్లుగా ప్రచారం చేస్తూ లబ్దిపొందుతున్నాయి.

అందుకే షాపింగ్ మాల్స్‌…అద్దాల మేడల్లో అందమైన మోసం.. కార్పొరేట్‌ కాకులు నిర్మించిన అంగడి…పేదోడిని నిలువునదోచే నిలయాలుగా మారాయి.బేరసారాలుండవు..అలవాటు చేయడమే తరువాయి..ఇక రేటెంతని అడగడము వుండదు..అంతా కంప్యూటర్ బిల్లులే.మర్రిఊడల్లా పాతుకుపోయి…ఇపుడు పట్నం నుండి పల్లెల వైపు పరుగులు తీస్తున్నాయి.

ఒకప్పుడు వేపపుల్ల, ఉప్పు, బొగ్గుతో పళ్లు తోముకును భారతీయులకు అవి తప్పని చెప్పి టూత్ పేస్ట్ అలవాటు చేశారు. 30- 40 సంవత్సరాల తర్వాత మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా?, మీ టూత్ పేస్ట్‌లో బొగ్గు ఉందా?, మీ టూత్ పేస్ట్‌లో వేప ఉందా అని అడిగి మళ్లీ మన పాత అలవాట్లే మనకే నేర్పిస్తున్నారు. కార్పోరేట్ కల్చర్ ఎంత మోసం చేస్తుంది అనడానికి గతంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఓ కార్పోరేట్ కంపెనీ పుచ్చకాయలను రైతులు అమ్మేదానికంటే తక్కువ ధరకే విక్రయిస్తుంది. అంటే రైతు ఉదాహరణకు 30 రూపాయలకు ఒక కాయ అమ్మాడంటే సదరు కంపెనీ దానిని 20కే అమ్ముతుంది..దీంతో జనం అంతా ఆ కార్పొరేట్ కంపెనీ వైపుకే ఎగబడతారు. తర్వాత రైతు కూడా గత్యంతరం లేక తన దగ్గర ఉన్న సరుకు అమ్ముడు పోక ఆ కంపెనీతో ఎంతోకొంతకు అమ్మేసే పరిస్థితి వస్తుంది. తర్వాత ఆ కంపెనీ వాటిని డబుల్ రేట్లకు అమ్మి లబ్ది పొందుతుంది..ఇది సరిగా ఇప్పుడు ఉన్న జీవన పరిస్థితులకు సరిపోతుంది. అరచేతిలో ప్రపంచాన్ని పరిచయం చేసి అడిగిన గంటల్లో గాల్లో వస్తువులతో…వచ్చి వాలిపోతారు..ఇది పేదోడి జేబుకు చిల్లులు..కార్పోరేట్లకు కాసుల వర్షం. ప్రజల్లో అవగాహన రానంత వరకు కార్పోరేట్ల చేతిలో మోసపోతునే ఉంటాం..

ఇవి కూడా చదవండి..

- Advertisement -