సుఖమయమైన వృధ్ధాప్యం కోసం..

285
- Advertisement -

జీవితకాల చక్రంలో ప్రతి ఒక్కరు వృద్ధాప్యం అనే చివరి స్టేజికి చేరుకోవాల్సిందే. వయసులో ఉన్నప్పుడు ఎన్నో కష్టనష్టాలను చవి చూసినా..వృద్దాప్యంలో మాత్రం ప్రతి ఒక్కరు సుఖవంతమైన జీవితాన్నే గడపాలని కోరుకుంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వృద్ధాప్యం జీవితంగా హాయిగా సాగిపోవాలని అనుకుంటారు. మరి వృద్దాప్యంలో సుఖమయమైన సంసారాన్ని పోందాలనుకునే వారికి మీ కోసం కొన్ని సలహాలు.

మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి. స్వతంత్రంగా జీవించడంలోని ఆనందాన్ని పొందండి. మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. పెద్ద వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు. ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.

మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి. మీ పిల్లల యొక్క సంసార జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి. మీరు మీ తరహాలో జీవించండి. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలనో లేదా నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి.

ప్రార్ధించండి కాని, అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు. చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోండి. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి. పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే.

ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరు కు వెళ్ళిరండి. దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోంది. ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను విశ్వసించండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Also Read:దొండకాయతో ఆరోగ్యం..

- Advertisement -