కరోనా నియంత్రణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, దశలవారీగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను తొలగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారు తిరిగిన ప్రాంతాలు, కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా పేర్కొంటున్న అధికారులు, మొత్తం 25 హాట్ స్పాట్ లను గుర్తించారు.
ఇక ఈ నెల 10 నాటికి మరో 25 హాట్ స్పాట్ లను గుర్తించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఏ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా మ్యాపింగ్ చేస్తారు. ఇలా హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్య పరీక్షల కోసం తరలిస్తారు.
దాదాపు 50 హాట్ స్పాట్ లు రాష్ట్రంలో ఉండవచ్చని, వీటిని మ్యాపింగ్ చేసి, ఈ ప్రాంతాల్లో ‘కంటైన్‌మెంట్ ప్లాన్’ను అమలు చేస్తూ, మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తెచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ, అందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.