ఎమ్మెల్సీ బరి నుండి కాంగ్రెస్ ఔట్‌..!

283
uttam guduru
- Advertisement -

టీఆర్ఎస్ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని భావించిన హస్తం నేతల ఆశలపై నీళ్లుచల్లారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,ఆత్రం సక్కు టీఆర్ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉత్తమ్‌ ఆరోపణలకు కొట్టిపారేసిన కేటీఆర్‌ ఆయనకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో బరిలోనుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సిద్ధమైనట్లు సమాచారం. ఆ పార్టీ అభ్యర్థి గూడురు నారాయణ రెడ్డి ఓటమి దాదాపు ఖరారు కావడంతో గౌరవప్రదంగా తప్పుకోవడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్ బలం 90కాగా కాంగ్రెస్‌ నుండి చేరిన ఇద్దరు,టీడీపీ ఎమ్మెల్యే సండ్ర,నామినెటేడ్ ఎమ్మెల్యేతో కలిపి 94కి చేరింది. ఎంఐఎం సభ్యులతో కలిపి 101కి చేరనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఒక్కో అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచేందుకు 21 ఓట్లు అవసరమవుతాయి. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలంటే 105 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు.  101 మంది సంఖ్యాబలం టీఆర్ఎస్ కు ఉంది.  మరో నలుగురి మద్దతు దొరికితే 5 ఎమ్మెల్సీ స్థానాలు కారు ఖాతాలో పడ్డట్లే. లేదంటే రెండో  ప్రాధాన్యత ఓట్లతో 5  స్థానాల్లో టీఆర్ఎస్-ఎంఐఎం గెలుచుకోవడం ఖాయం.

కాంగ్రెస్ కు ఇప్పటివరకు 19 మంది సభ్యుల బలముంది. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ సంఖ్యాబలం 17కు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్ధానాన్ని గెలుచుకునే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో బరిలో నుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది.

- Advertisement -