తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహంగా ఉన్నారా…? రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారా…? నేరుగా రాహుల్ తోనే తేల్చుకుంటానని జానా రెడీ ఫిక్స్ అయ్యారా…? అంటే అవుననే చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపులు రాజకీయం మళ్లీ జోరందుకుంది. కొంత సైలెంట్‌గా ఉన్నట్లు కనపడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగడటంతో కాంగ్రెస్ నేతలంతా ఉలిక్కి పడ్డారు. రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది అనుకుంటే… తానేదో సాధించినట్లు క్రెడిట్ అంతా తనే తీసుకునే ప్రయత్నం చేశారని మరికొందరు సీనియర్లు రేవంత్‌పై గుర్రుగా ఉన్నారు.
తాజాగా ఈ లిస్టులో సీనియర్ నేత జానారెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ ఇటీవల ఆయనను చేరికల కమిటీ చైర్మన్‌ను చేసింది. పార్టీలోకి ఎవరు రావాలన్నా… జానాతో కోఆర్డినేట్ చేయాలని ఇటు రేవంత్ రెడ్డికి కూడా రాహుల్ స్వయంగా సూచించారు. కానీ, రేవంత్ తీరు కుక్క తోక వంకరే అన్న చందంగానే సాగుతుంది. గురువారం కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఓదేలు, జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి వచ్చారు. రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాను కల్పించటంతో పాటు ప్రియాంకతో కండువా కప్పించారు.
కానీ ఈ వ్యవహరం ముందుగా తెలియాల్సిన జానాకు తెలియదని, తనకు తెలియకుండా చేరికలను ప్రోత్సహిస్తే ఇక తనకు అవమానం కాదా…? తన సీనియారిటీకి పీసీసీ చీఫ్ ఇచ్చే గౌరవం ఇదేనా అని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి జానారెడ్డి చాలా విషయాలు పట్టించుకోరని… కానీ, రేవంత్ ఒంటెత్తు పోకడలు ఎలా ఉంటాయో జానారెడ్డికి స్వయంగా అర్థం అవుతున్నాయని సీనియర్లు అంటున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న జానాను కూడా ఢిల్లీకి తీసుకపోతే రేవంత్‌కు వచ్చిన నష్టం ఏంటని…? కావాలనే తొక్కేసి తనొక్కడే అంతా చేసినట్లు ప్రచారం చేసుకునే కుట్ర అని సీనియర్లు మండిపడుతున్నారు. రాహుల్‌తో మళ్లీ జరిగే భేటీలో గట్టిగానే కొట్లాడాలని నిర్ణయానికి వచ్చారు.