పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

7
- Advertisement -

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంతరం పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని మండిపడింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు గుప్పించింది.

దేశవ్యాప్తంగా చమురు ధరలు సామాన్యుడికి భారంగా మారిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించింది. “మెహంగై మ్యాన్ (ధరల పెంచే వ్యక్తి) మోడీ” అంటూ ప్రధానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై పైసల రూపంలో పెంచుకుంటూ పోతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జేబులను నిలువునా లూటీ చేస్తోందని ఆరోపించింది.

ప్రధాని మోడీకి దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల కష్టాల కంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల లాభాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని కాంగ్రెస్ విమర్శించింది. “కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం ఇలా పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుంది?” అంటూ నిలదీసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించకుండా, కేవలం కొద్దిమంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే ఇంధన ధరలను పెంచుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

- Advertisement -