గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి గులాబీ దళంలో చేరారు. కేటీఆర్ ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌పై వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్బంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైందని ఆలోచిస్తే.. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే అన్న విషయం తనకు అర్థమైందని ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు విజయం లభించిందని చెప్పారు.
ప్రజలు కేసీఆర్‌ని నమ్మారని, టీఆర్ఎస్ సర్కారే మళ్లీ కావాలని కోరుకున్నారు కనుక తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు. టీఆర్ఎస్‌లో చేరి ప్రజలు కోరుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందువల్లే రెండు సార్లు ఓడిపోయానని తెలిపారు. సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వెల్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నాలుగేళ్లలో గజ్వెల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు అడగకుండానే సీఎం కేసీఆర్ ఎన్నో పనుల చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.