ఏపీలో కాంగ్రెస్ ‘సెన్సిటివ్ ప్లాన్’?

14
- Advertisement -

ఇటీవల సౌత్ రాష్ట్రాలపై కాంగ్రెస్ గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం సాధించింది. ఇప్పుడు ఏపీలో పట్టు సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఏపీలో 2014 తరువాత హస్తం పార్టీ పూర్తిగా పతనమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన చాలా మంది నేతలు ఇతర పార్టీల గూటికి చేరారు. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన వేళ తెలంగాణలో ఆ పార్టీ గెలవడంతో కొత్త ఆశలు చిగురించాయి. గట్టిగా ప్రయత్నిస్తే ఏపీలో కూడా పూర్వవైభవం సాధించవచ్చనే ఉద్దేశ్యంతో ఉంది హస్తం అధిష్టానం. అందుకే ప్రస్తుతం ఏపీపై గట్టిగా ఫోకస్ పెడుతోంది.

ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ను బలపరిచేందుకు వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. త్వరలోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడానికి షర్మిల కొంతమేర హెల్ప్ అయినప్పటికి రాబోయే ఎన్నికల్లో ప్రజల దృష్టిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలంటే అంతకు మించి చేయాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ మరో ప్లాన్ కు రెడీ అయింది.

ఆంధ్రప్రదేశ్ లో సెన్సిటివ్ సమస్యగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ తెరపైకి తెస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ హామీ ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా అంశాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకొని ఏపీలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ అయిన మాణిక్యం ఠాకూర్ కూడా కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే హస్తం పార్టీ ఏపీలో ప్రభావం చూపేందుకు గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.

Also Read:‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?

- Advertisement -