ప్రతీది ఢిల్లీలోనే.. ఏంటిది రేవంత్ ?

40
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ డిల్లీ ప్రయాణమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పది సార్లకు పైగా డిల్లీ వెళ్ళిన సి‌ఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు రేవంత్ రెడ్డి వెళ్లినట్లు తెలుస్తోంది. 17 లోక్ సభ స్థానాలకుగాను ఇప్పటివరకు 4 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగిలిన 13 స్థానాలకు త్వరనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఓవరాల్ గా 17 లోక్ సభ స్థానాలకు గాను 300 పైగా దరఖాస్తులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడం హస్తం నేతలకు కత్తిమీద సాములా మారింది..

ఎందుకంటే ఈసారి కీలక నేతల కుటుంబ సభ్యులు సీట్ల కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క సతీమణి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి కుమార్తె, గడ్డం వివేక్ కుమారుడు ( గడ్డం వంశీ ), జానారెడ్డి కుమారుడు ( రఘువీరారెడ్డి ).. ఇలా చాలమందే రేస్ లో ఉన్నారు. మరి కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తే ఇతర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని చాలామంది నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. అందువల్ల అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ ఆగ్రనేతలకు తలనొప్పిగా మారింది.

ఈ అంశంపై తాజాగా రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్ళడంతో ఆయన డిల్లీ ప్రయాణం ముగిసిన తర్వాత సీట్ల కేటాయింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలా ప్రతి అంశానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ తరపున గాని అటు పార్టీ తరపున గాని సొంత నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలం అవుతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి సి‌ఎం రేవంత్ రెడ్డి మరోసారి డిల్లీ వెళ్ళడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రాగానే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -