ఆంధ్రపదేశ్‌లో వైఎస్సార్ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ రోజు ఏపీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్ది తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా రూ.1,252 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ పంటల బీమా పథకంతో పాలనా పరంగా మరో అడుగు ముందుకేశామని తెలిపారు.
గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా.. ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. 2019లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు.. రూ.1252 కోట్ల బీమా సొమ్మును అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నాం.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. కానీ బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాం. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరుపున బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాలతో ఆర్‌బీకేలను అనుసంధానం చేశాం. గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌లో నమోదవుతోంది’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.