త్వరలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ కార్యాలయం ప్రారంభం…

253
damodhar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను పరిపుష్టం చేయడానికి, ఆధునికతను సంతరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు కోలేటి దామోదర్‌. తెలంగాణ పోలీస్ అంటే స్కాట్ ల్యాండ్ పోలీస్ స్థాయిలో వుండాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటించారు కూడాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన నిర్వహించిన మొట్టమొదటి అధికారిక సమావేశం రాష్ట్ర డిజిపితోనే. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకుంది. అలాగే పాతకాలం నాటి పోలీస్ వాహనాల స్థానంలో అత్యాధునిక ఇన్నోవా కార్లను కూడా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు సమకూర్చడం జరిగిందన్నారు.

భారతదేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కోసం ట్విన్ టవర్స్ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది వెంటనే ఈ పోలీస్ ప్రధాన కేంద్రానికి చేరుతుంది. అక్కడి నుంచి అవసరమైన వారందరికీ సమాచారం పంపే ఏర్పాటు వుంటుంది. రాష్ట్రంలో అన్ని సిసి టీవీ కెమెరాలు ఈ కేంద్రంతో అనుసంధానింపబడతాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషి మనుగడకు మన మస్తిష్కం ఎలా పనిచేస్తుందో అలాగే పోలీస్ వ్యవస్థకంతటికీ ఈ కేంద్రం మెదడులాగా పనిచేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని పోలీస్ భవనాలు నిజాం కాలం నాటివే. అవి ఇప్పుడు భూత్ బంగళాలను తలపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రమంతటా పోలీస్ భవనాల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఈ బృహత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ఈ కార్పొరేషన్ లో సిఇ, ఎఇ, ఈఈలు మరియు డిఈఈలు వంటి సమర్థులైన అధికారులు మరియు సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణలో రాష్ట్రమంతటా పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ భవనాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంతేకాక కొత్తగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా కేంద్ర పోలీస్ భవనాల నిర్మాణం (డిపిఓలు) కూడా అన్ని సౌకర్యాలతో చేపట్టడం

ఇందులో భాగంగానే 14 జిల్లా కేంద్రాలలో (కామారెడ్డి, రామగుండం, సిద్దిపేట, ఆసిఫాబాద్, గద్వాల్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి, మహబూబాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, జగిత్యాల్, మెదక్) లలో డిపిట భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లా పోలీస్ కమీషనరేట్ కార్యాలయం భవన నిర్మాణం 20 ఎకరాల పైబడిన ప్రాంగణంలో 15 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో చేపట్టడం జరిగింది. అలాగే మర్కూక్ లో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి సమయానుకూలతను బట్టి సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ భవనానికి ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.

- Advertisement -