తెలంగాణ శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శం..

220
cm kcr
- Advertisement -

అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు.ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తోందని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన ఒకటన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడా గుడుంబా తయారీ జరుగుతున్నట్లు సమాచారముంది. గుడుంబా తయారీని తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించారు.

సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలని సీఎం అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. గత పాలకులు కలప స్మగ్లింగ్‌ను పట్టించుకోకపోవడంతో కొందరికి అలుసుగా మారిందన్నారు. కలప స్మగ్లింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఫారెస్టు స్మగ్లింగ్‌ను అరికట్టంలో అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్‌ పోలీస్‌ వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని స్మగ్లింగ్‌ వంటి అటవీ నేరాలను అరికట్టాలన్నారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఎప్పటికప్పుడు ఇరుశాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగ్‌ నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.

బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీస్‌ వ్యవస్థకు ఉందని సీఎం అన్నారు. సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమన్నారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలన్నారు. దళితులపై దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి కిందిస్థాయి పోలీస్‌ వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలన్నారు. పౌరులందరికీ గౌరవాన్నిస్తూ ఫ్రెండ్లీ పోలీస్‌ స్ఫూర్తిని పెంచుకోవాల్సిందిగా సూచించారు. రక్షణ కోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం పేర్కొన్నారు.

దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలని సమావేశంలో సీఎం చెప్పారు. హైదరాబాద్ లో పది లక్షల సిసి కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డిజిపికి సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సీఎం తెలిపారు. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు హాజరయ్యారు.

- Advertisement -