తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ మోహన్‌లాల్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలని…ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తితో పాటు అభ్యర్థి వెనకున్న పార్టీని చూసి ఓటేయాలన్నారు. ప్రజల గురించి ఆలోచించే పార్టీలకు ఓటు వేస్తేనే మనకు మంచి జరుగుతుందన్నారు. ఓటు అనే ఆయుధం ప్రజల తలరాత, రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తుందని కాబట్టి బీఆర్ఎస్‌కే ఓటు వేయాలన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఇవాళ అభివృద్దిలో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటింని జోడెడ్లలాగ పరుగులు పెట్టిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగి దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామన్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందని గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. మంచినీటి,కరెంట్ సమస్యను అధిగమించామన్నారు.
కాంగ్రెస్ పాలనలో పల్లెలు, గ్రామాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలన్నారు. వైరా గ్రామపంచాయితీగా ఉండే దీనిని మున్సిపాలిటీగా చేసుకుని అభివృద్ది చేసుకుంటున్నాం అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో హరిగోస పడ్డామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటున్నారని ఆ దిక్కుమాలిన రాజ్యం ఎందుకని మండిపడ్డారు. వలసలు,దోపిడిలు,అరాచకం తప్ప ఇందిరమ్మ పాలనలో ఒరిగిందేమి లేదన్నారు. ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చిందని గుర్తు చేశారు. పేదలకు ఇవాళ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, కళ్యాణ లక్ష్మీ, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా ఇలా ప్రతి ఒక్కటి మీ కళ్ల ముందే ఉన్నాయన్నారు.
గతంలో సాగునీటి పన్ను వసూలు చేసేవారని దానిని రద్దు చేశామన్నారు. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని, రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతులు పండించే ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పొడు భూములు ఈ నియోజకవర్గంలో 7 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. పోడు భూములకు రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. మా తండాలో మా రాజ్యం ఇది గిరిజన బిడ్డల నినాదం…దానిని నెరవేర్చి 3500 తండాలను గ్రామ పంచాయితీలు చేశామన్నారు.బీఆర్ఎస్ గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు, పెన్షన్ రూ. 5 వేలు చేస్తామని తెలిపారు.
Also Read:దేశంలో జమిలి ఎలక్షన్స్ కన్ఫర్మ్?