కొన్ని రాజకీయ శక్తులు మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పిచ్చి కొట్లాటలు పెట్టి దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యనే కర్ణాటకలో బీజేపీ మంత్రిని అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుంచి తొలగించారు. ఈ విధంగా అవినీతికి పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు అన్నారు. అనాలోచితమైన ఆలోచనలు దేశంలో అమలు అవుతున్నాయి. అందుబాటులో ఉన్న విద్యుత్ ను కేంద్రం ఉపయోగించుకోవడం లేదు. దేశంలో నీటి యుద్ధాలు జరగటానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలి. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ కాపలా దారు లాంటిది. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్‌ఎస్ పార్టీ. ఎవరూ పెట్టని కోట టీఆర్‌ఎస్ పార్టీ. దేశానికే ఒక రోల్ మోడల్ గా తెలంగాణ పాలన సాగుతోంది. తెలంగాణ అభివృద్ధి కేంద్రం ఇచ్చే అవార్డులు చూస్తేనే అర్థం అవుతుంది. నిన్న 10కి పది గ్రామాలు కేంద్రం పరిశీలనలో ఉత్తమమైన గ్రామాలు ఎన్నికైనవి కేసీఆర్ తెలిపారు.
కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు. పదవుల కోసం ఏమైనా చేస్తారా?.. కుటిల బుద్ధితో దేశాన్ని కూలగొట్టడం ఈజీ- కానీ నిలబెట్టడం కష్టం అన్నారు. హిజాబ్ ,హలాల్ అంశాలతో కర్ణాటక అట్టుడుకుతోంది. సిలికాన్ వ్యాలీలో 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు. మత విద్వేషాలు పెరిగితే వారి పరిస్థితి ఎం కావాలి అని కేసీఆర్ ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న 13 కోట్ల మన వాళ్ళను ఆ దేశాలు వెల్లగొడితే ఈ దేశం సాదుతుందా?.. దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. కొందరు సమసిపోయిన గాయాలపై కారం చల్లుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
కొన్ని పార్టీలు మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పిచ్చి కొట్లాటలు పెట్టి దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు.మతపరమైన ఊరేగింపుల్లో కత్తులు- తుపాకులు పట్టుకొని ఏం చెప్పదలచుకున్నారు? మతం- కులం పేరుతో విద్వేషాలా ?జనాలు పొడుచుకొని చావాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో కుటిల రాజకీయం చేస్తున్నారు. మృగాళ్లలాగ కత్తులతో రాజకీయం చేస్తున్నారు. కావాల్సింది కత్తులు కాదు.. పొలాలకు సాగు నీళ్లు రావాలి. అంబెడ్కర్ ఆశయం కోసం కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలి. దేశం కోసం టీఆర్‌ఎస్ ఉజ్వలమైన పాత్ర వహిస్తుంది. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. తెలంగాణ తరహాలోనే భూకంపం పుట్టించి- విద్రోహ శక్తులను తరిమికొడుదామని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఢిల్లీ గద్దెనెక్కాల్సింది ప్రజలు- పార్టీలు కాదు!. ఎవరినో గద్దె దించడానికో- ఎక్కించడానికే కూటములు పెట్టొద్దు. రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావు.ప్రత్యామ్నాయ ఎజెండా రావాలి. డొల్ల ‘కల్లి బొల్లి మాటలు కావు- దేశాన్ని అభివృద్ధి చేసే ఎజెండా కావాలి. ప్రత్యామ్నాయ గుంపు కాదు- కూటమి కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ఎల్లయ్యను మల్లయ్యను ప్రధాని చేయడానికి కాదు మనకు. గవర్నర్ల వ్యవస్థ సరిగ్గా లేదు అన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ లో పెట్టుకున్నారు- బెంగాల్- మహారాష్ట్ర తో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దు. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన గవర్నర్…అవమానపడి వెళ్లిపోయారు అని కేసీఆర్ గుర్తు చేశారు.