కేంద్రంలో మార్పు త‌థ్యం.. మోదీపై కేసీఆర్ విమర్శలు..

36
KCR cm
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని సీఎం కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదని, ఉజ్వల్‌ భారత్‌ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని, దేశంలో అపారమైన యువశక్తి ఉందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇప్ప‌టికే ఎందరో ప్ర‌ధానులు దేశాన్ని ప‌రిపాలించార‌ని, ఎన్నో ప్ర‌భుత్వాలు రాజ్యాన్ని ఏలాయ‌ని.. అయినా.. దేశ ప‌రిస్థితి ఏమాత్రం మార‌లేద‌ని కేసీఆర్‌ అన్నారు. ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డ‌చినా.. ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే వుండిపోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని అన్నారు. నిజంగా మ‌న‌సు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికా కంటే ఆర్థికంగా మ‌న‌మే ఫ‌స్ట్ ప్లేస్‌లో వుంటామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం దేశంలో స్వ‌తంత్ర భార‌త అమృతోత్స‌వాల‌ను జరుపుకుంటున్నామ‌ని, అయినా.. క‌రెంట్ కోసం, మంచినీళ్ల కోసం, సాగు నీటి కోసం ఇంకా అల్ల‌ల్లాడుతూనే వుంద‌ని సీఎం కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రంలో ఎవ‌రి సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాద‌ని, ఒక ఉజ్వ‌ల భార‌తం కోసం శ్ర‌మించాల్సిన అవ‌స‌రం వుంద‌ని నొక్కి చెప్పారు. దేశంలోని ఏ వ‌ర్గం కూడా మోదీ పాల‌న‌తో సంతోషంగా లేద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. రోజురోజుకీ ప‌రిస్థితి దిగ‌జారిపోతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -