తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నల్గొండ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధి చేసే వారిని గెలిపించేందుకు సరైన తీర్పు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎంక కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడానికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు వక్రబుద్ధితో, ఓర్వలేని తనంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని, ప్రతిపక్షాలు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించడానికే, ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేల్చిచెప్పడానికే తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
నల్గొండ జిల్లా ప్రజలు తెలివైన వారని, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా పిడికిలి బిగించి పోరాటానికి జంగ్ సైరన్ ఊది అగ్రభాగన నిలిచిన పురిటిగడ్డ నల్గొండ గడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలో అతి ముఖ్యమైన సమస్య ఫ్లోరైడ్ సమస్యపై తాను 8 రోజులు పోరాటం చేశానని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడానికే 2001లో గులాబీ జెండా ఎగిరిందని, తాను ఉద్యమాన్ని ప్రారంభించిన మొదట్లో చాలా మందికి చాలా అనుమానాలు ఉండేవని, చాలా మంది తమ పార్టీపై చాలా విమర్శలు చేశారని, తాను ఆత్మవిశ్వాసంతో, గుండెల నిండా ధైర్యంతో ఒక్కటే మాట చెప్పానని ఉద్యమాన్ని వీడితే తనను రాళ్లతో కొట్టి చంపండని చెప్పానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం తనమీద విశ్వాసంతో తనవెంట నడిచిందని, మీ అందరి స్పూర్తితో 14 సంవత్సరాలు నిరంతర అవిరామ కృషితో పోరాడి ఎంతో మంది అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు.
సమైక్య రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో స్థానమే లేదని చెప్పారని, కానీ అదే జిల్లాలో 2014 లో జరిగిన ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీని 6 స్థానాల్లో గెలిపించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండవం చేసాయని, కొత్త సంసారం, కరెంటు కష్టాలతో తెలంగాణ ప్రజానీకం అరిగొసపడిందని, ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ బిడ్డలు నిలువునా కూలిపోయారని, చేతి కుల వృత్తులు మూలకుపడ్డాయని, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్ధితి ఉండేదని, కానీ నేడు తెలంగాణలో స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో మీ అందరి దీవెనలతో రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా, రైతు ఆత్మహత్యలు లేకుండా, చేతి కుల వృత్తులకు నూతన జవసత్వాలు నింపామని చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందిస్తామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లిస్తామని తాను అసెంబ్లీలో చెప్పిన మాట నిజం కాబోతోందని సీఎం కేసీఆర్ అన్నారు.