బీజేపీపై ఇక పోరాటమేనని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో మాట్లాడిన సీఎం..టీఆర్ఎస్ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడుదాం అని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. …మనం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం…. ఏ తప్పు చేయనివాళ్లం ఎందుకు భయపడతాం…. ఎటువంటి పరిణామాలనైనా నిటారుగా నిలబడి ఎదుర్కొందాం అన్నారు.
బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదలును రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడిక్కడ బీజేపీ వికృత చేష్టలను ఎండగట్టాలి…. ప్రతీ ఒక్కరూ ఒక్కో కేసీఆర్ వలె నిలబడి కలెబడాలన్నారు. బీజేపీపై మనం చేస్తున్నది ధర్మయుద్ధం. బీజేపీపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సంకేతాన్ని దేశానికి ఇవ్వాలి. ఇందుకోసం మనం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం అన్నారు. దేశ రక్షణ..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఆ పోరాటం తెలంగాణ గడ్డ నుంచే మొదలు కావాలన్నారు. బీజేపీ కుట్రలను ఎక్కడిక్కడ చీల్చి చెండాడాలన్నారు.
దేశమంతా విజయవంతంగా బీజేపీ కుట్రలను చేయగలిగింది… 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేయాలని చూసింది. కానీ తెలంగాణ దాని కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టిందన్నారు. బీజేపీ చేసిన కుట్రలకు సంబంధించిన 5 టెరాబైట్ల (దాదాపు 5లక్షల పేజీలకు సమానం) సమాచారం ఉంది. అన్ని స్థాయిల న్యాయస్థానాలకు, దేశంలోని పార్టీ అధ్యక్షులు, సీఎంలకు అందరికీ బీజేపీ నిజ్వరూపాన్ని పంపించాం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని వదిలేదు…. వదిలే ప్రసక్తేలేదు అన్నారు. ప్రపంచంలోనే అహంకారం.. ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ. దీన్ని నిజస్వరూపాన్ని తెలంగాణ బయటపెట్టిందన్నారు.
మనం చేసేది న్యాయపోరాటం. ధర్మపోరాటం. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ బీజేపీ సర్వనాశనం చేస్తుందన్నారు.గడచిన 8 ఏండ్ల కాలంలో ఈడీ అనేక కేసులు పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసును నిరూపించలేకపోయిందన్నారు. బీజేపీ దగ్గర రూ. 2లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? దీన్ని దేనికోసం వాడుతున్నారో తెలియజెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు. బీజేపీ కావాలని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులకు సైతం పూనుకోవచ్చు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. ధర్మంగా ఉన్నాం. న్యాయబద్ధంగా ఉన్నాం అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని..మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి చేసింది. దాదాగిరి చేసింది. అయినా ప్రజలు మనవైపే ఉన్నారు. దీన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు.
దేశంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయం. దేశమంతా రాల్గాంధీ జోడోయాత్ర చేస్తాడు కానీ, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి..అక్కడ జోడో యాత్ర చేయకపోవడం వెనుక ఆంతర్యం తానే కాదు ఎవరేం చేసినా కాంగ్రెస్ బతకదని చెప్పే ప్రయత్నం. కనుక దేశంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయమనన్నారు. దళితబంధు నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. ధరిణితో 98 శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయితే ఇంకా అక్కడక్కడా కొన్ని సమస్యలున్నాయి. వీటి పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ మిగిలిన 2 శాతం సమస్యలు లేకుండా చేద్దాం అన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. అవి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో భోజనాలు చేసి పోయాం అన్నట్టుగా ఉండకూడదు. వీటికి మంత్రులు కూడా హాజరు కావాలన్నారు.
జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన సీఎం..త్వరలో జిల్లా పర్యనలు చేస్తా అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయి. సిట్టింగ్లకే సీట్లు. 95 సీట్లను అవలీలగా గెలుస్తాం అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులను రూపొందించాలి. మన ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ అందులో ఉండాలన్నారు. ఎమ్మెల్యేలందరూ ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జీని నియమించాలి. ఆ జాబితాను పంపించాలన్నారు. ఫోన్లు చేసి పార్టీ మారుతారా? అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అని గట్టిగా చెప్పాలి. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలుంటే 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలో దర్జాగా ఉన్నామనే ధైర్యంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..